November 19, 2019

నెల్లూరులో వాడీవేడీగా జరిగిన ఐఏబి సమావేశం – అధికారుల తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని గోల్డెన్ జూబ్లీ హాల్లో బుధవారం ఉదయం సాగునీటి సలహా బోర్డు సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు అధ్యక్షతను జరిగిన ఈ సమావేశానికి జిల్లా మంత్రులైన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ బోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అలాగే జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, రైతు సంఘాల నేతలు, జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు. ముందుగా ఇరిగేషన్ అధికారులు జిల్లాలో మొదటి పంటకు ఎన్ని ఎకరాలకు నీరు విడుదల చేయాలి అనే దానిపై ప్రతిపాదనలు చదివి వినిపించారు. దీనిపై సభ్యుల అభిప్రాయాలు కోరారు. దీంతో స్పందించిన మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రతిపాదనల్లో అధికారులు చూపిన లెక్కలు కాకి లెక్కలను తలపిస్తున్నాయని అన్నారు. ఇదే లెక్కల ప్రకారం నీటిని విడుదల చేస్తే రెండో పంటకు చుక్కనీరు కూడా మిగలదని మంత్రుల దృష్ఠికి తీసుకెళ్లారు. ప్రతిపాదిత లెక్కలకు సమాధానం చెప్పాల్సిన చీఫ్ ఇంజనీర్ సమావేశానికి గైర్హాజరవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమశిల, కండలేరులో ఉన్న నీటితో ప్రతిపాదిత ఆయకట్టుకు నీటి సరఫరా సరిపోతుందని అయితే రెండో పంటకు ఏం చేయాలని ప్రశ్నించారు. రెండో పంటను దృష్ఠిలో ఉంచుకోకుండా ప్రతిపాదనలు ఎలా తయారు చేస్తారని రామ నారాయణరెడ్డి అన్నారు.

కండలేరు నుండి నిబంధనల మేరకు తమిళనాడుకు 12 టి.ఎమ్.సి ల నీరు ఇవ్వాల్సి ఉందని అలాగే చిత్తూరుకు కూడా ఇవ్వాలని గుర్తు చేశారు. జిల్లా రైతాంగానికి ఇబ్బంది లేకుండా వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రతిపాదనలు తయారు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అధికారులు చెప్పిన దాని ప్రకారం గూడూరు, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గ రైతులు నీరు అందక ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని కాలువ పనులు పూర్తి కాకున్నా అధికారులు పనులు అయినట్లు చూపి వాటికి నీటి కేటాయింపులు జరిపారని పనులు పూర్తి కాకపోతే నీరు పొలాల్లోకి ఎలా చేరుతాయని అనుమానం వ్యక్తం చేశారు. జిల్లాలోని రెండు జలాశయాల్లో పుష్కలంగా నీరున్నా… అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సామెతలా నీరున్నా వాటిని సరిగా వాడుకోలేని దుస్థితి ఏర్పడుతుందని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలకు సరిపడా సాగునీరు విడుదల చేయాలని కోరారు. గడచిన నాలుగేళ్ల నుండి జిల్లాలో వర్షాలు లేవని ఫలితంగా బావులు, చెరువులు ఎండిపోయాయని గ్రామాల్లో కనీసం తాగునీరు కూడా లేదని గుర్తు చేశారు. వీటన్నింటిని దృష్ఠిలో ఉంచుకుని నీటి కేటాయింపులు జరపాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!