November 21, 2019

ఆత్మకూరులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు – ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు

Clock Of Nellore ( Atmakur ) – న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఉందంటే, అందుకు కారణం మారుమూల ప్రాంతాల్లోని కోర్టుల్లో కష్టపడి పనిచేస్తున్న న్యాయమూర్తులేనని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు పేర్కొన్నారు. నెల్లూరుజిల్లా ఆత్మకూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో నెల్లూరుజిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వెంకట కృష్ణయ్య, కలెక్టర్ శేషగిరి బాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, కోర్టు హాలులో కావలి జడ్జి పాండు రంగారావు నేతృత్వంలో ట్రయల్ కోర్టును నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో హైకోర్టు న్యూయమూర్తి జస్టిస్ సోమయాజులు మాట్లాడారు. న్యాయస్థానానికి వెళితే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఇంకా ప్రజల్లో ఉందంటే అందుకు కారణం మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులేనని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో ఎందరో గొప్ప వ్యక్తులు మొదట్లో జిల్లా కోర్టుల్లో పనిచేసిన వారేనని, చిన్న పల్లెటూర్లలో నుంచి వచ్చిన వారు సైతం అంచలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని గుర్తు చేశారు. నెల్లూరు, ఆత్మకూరుకే పరిమితం కాకుండా అన్నీ చట్టాలను ఆత్మ విశ్వాసంతో నిరంతరం నేర్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం సీనియర్ల అనుభవాలను తెలుసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే న్యాయవాదులు బాగా పనిచేయగలరనే నమ్మకం ఉందని, చట్టం ఎక్కడైనా ఒక్కటేనని, అయితే చెప్పే పద్దతిపై ఆధారపడి ఉంటుందని జస్టిస్ సోమయాజులు పేర్కొన్నారు. న్యాయమూర్తి కేటాయించిన సమయాన్ని న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే న్యాయస్థానం పట్ల గౌరవ మర్యాదలు ఉండాలని, సమయానికి హాజరుకావాలని సూచించారు. 1988 నుంచి కష్టపడితే ఆత్మకూరులో కొత్త కోర్టు ఏర్పాటైందని గుర్తు చేశారు. ఆత్మకూరు ప్రాంతం ఎంతో పురాతనమైందని, బౌద్దులు, జైనులు కాలం నుంచి జనావాసం ఉందని చరిత్రను వివరించారు హైకోర్టు న్యాయమూర్తి. కార్యక్రమం అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులును, జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఆత్మకూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జయలక్ష్మి ఆధ్వర్యంలో న్యాయవాదులు సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!