November 19, 2019

జీడిపి లెక్కలు కాదు… రైతు సంతోషమే అసలైన అభివృద్ది … రైతు భరోసా సభలో జగన్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – అభివృద్ధి అంటే జీడిపి లెక్కలు కాదని, దేశానికి అన్నం పెట్టే రైతులు సంతోషంగా ఉంటేనే అసలైన అభివృద్ధి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరుకు విచ్చేసిన ఆయన విక్రమ సింహపురి యూనివర్శిటీ ప్రాంగణంలో జరిగిన సభలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా పథకానికి సంభందించిన సహాయపు చెక్కును రైతులకు అందజేశారు. అలాగే ఇప్పటికే నమోదైన రైతులకు ఆన్ లైన్ ద్వారా నగదును బదలీ చేస్తూ ల్యాప్ టాప్ లో మీటను నొక్కారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. నెల్లూరుజిల్లాలో అన్నీ జలాశయాలు నీటితో కళకళలాడుతుండటం చాలా సంతోషంగా ఉందని, మంచి మనస్సుతో రైతులకు మంచి చేయాలని తలంచాము కాబట్టే భగవంతుడు కూడా దీవించాడని అన్నారు. రైతు బిడ్డగా నెల్లూరుకు వచ్చానని, వైసీపి ప్రభుత్వం రైతును గుండెల్లో పెట్టుకుంది అనడానికి రైతు భరోసా పథకమే ఉదాహరణ అని పేర్కొన్నారు.

దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు అత్యధికంగా సాయం అందించే పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అని జగన్ వివరించారు. 2014 తర్వాత రైతులు సర్వం నష్టపోయి విలవిలలాడిపోయారని, తన పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గరగా చూశానని, రైతుల ఆత్మహత్యలు తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సున్నా వడ్డీ, పావలా వడ్డీ లేక రైతులు రుణాలు పొందలేని పరిస్థితి ఉండేది, 2017లోనే రైతు భరోసా పథకం ద్వారా రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చా… ఎన్నికల వాగ్ధానాన్ని చెప్పిన దానికంటే ముందుగా, మెరుగైన మార్పులతో రైతు భరోసా పథకాన్ని నెల్లూరు నుండి ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇచ్చిన ప్రతీ హామీని మెరుగ్గా అమలు చేస్తున్నాం… భూములు లేని ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ వర్గాల వారికి కూడా రైతు భరోసా అమలు చేస్తున్నామని, 54 లక్షల మంది రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని అన్నారు. ఏటా 13వేల చొప్పున రైతులకు అందిస్తామని వెల్లడించారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు భరోసాగా నిలబడ్డామని స్పష్టం చేశారు.. రైతులకు 9గంటల పాటూ పగటి పూట ఉచిత విద్యుత్ అందిస్తానని హామీ ఇచ్చానని… దానిపై ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశామని, ప్రస్తుతం 60శాతం ఫీడర్లలో ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వచ్చే ఏడాది జూలై మాసానికి మిగిలిన 40శాతం ఫీడర్లలో అది పూర్తిగా అమలవుతుందని సిఎం వెల్లడించారు. రైతులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పంట భీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని, పక్క రాష్ట్రాల్లో యూనియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మన రాష్ట్రంలో యూరియా కొరతే లేకుండా జాగ్రత్తలు తీసుకుని రైతులకు బాసటగా నిలిచామని పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యకు పాల్పడితే వెంటనే 7లక్షలు ఇస్తున్నాం. ఆక్వా రైతులను ఆదుకుంటాం. ఆవులు, గేదెలు కూడా మరణిస్తే 15 వేల నుండి 35 వేల వరకూ సాయం అందిస్తున్నాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేశామని జగన్మోహన్ రెడ్డి అన్నారు.

అభివృద్ది అంటే జీడిపి లెక్కలు కాదు రైతులు బాగుంటేనే అభివృద్ధి జరిగినట్లు లెక్క అన్నారు. గ్రామ సచివాలయాల పక్కనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, మందులు విక్రయానికి షాపులు ఈ ఏడాదిలోనే ప్రారంభించనున్నట్లు తెలియజేస్తూ ప్రతీ మండలంలోనూ శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని, ప్రతీ రెండు, మూడు నియోజకవర్గాలను ఒక యూనిట్ గా చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రతీ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో కూడా ఇరిగేషన్ పనులన్నీ పూర్తి చేస్తామని, కాకాణి గోవర్ధన్ రెడ్డి కోరిక మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయిస్తానని హమీ ఇచ్చారు. నవంబర్ 15వ తేదీ వరకూ అర్హులైన రైతులు వారి వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు, అర్హత కలిగిన ప్రతీ రైతు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!