November 22, 2019

తన తప్పుడు మాట వినలేదని స్నేహితుణ్ని కడతేర్చిన కసాయి – నెల్లూరుజిల్లాలో దారుణం

Clock Of Nellore ( Gudur ) – పని మానేసి తనతో పాటూ జులాయిగా తిరగాలన్న మాటను వినలేదని స్నేహితుణ్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ కసాయి. నెల్లూరుజిల్లా గూడూరు పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తెనాలికి చెందిన వేణు అనే వ్యక్తి గూడూరు రైల్వే స్టేషన్ లో వెండర్ ఉంటున్నాడు. రైళ్లలో తినుబండారాలు అమ్ముతూ వారిచ్చే జీతంతో జీవనం సాగించేవాడు. కొద్ది రోజుల తర్వాత తెనాలిలోని తన స్నేహితుడు చరణ్ ను వెండర్ పనిలో కుదిర్చాడు. ఇద్దరూ గూడూరులోని బొగ్గులదిబ్బ ప్రాంతంలో ఉండేవారు. ఈ క్రమంలో పని సక్రమంగా చేయడం లేదని వేణును పనిలో నుండి తొలగించాడు యజమాని. తర్వాత నువ్వు కూడా పనిమానెయ్ అంటూ స్నేహితుడు చరణ్ పై ఒత్తిడి తెస్తూ వచ్చాడు. ఈ నేపద్యంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో పని ముగించుకుని చరణ్ రైల్వే స్టేషన్ నుండి బొగ్గుల దిబ్బకు వెళ్తుండగా వేణు పిలిచాడు. మళ్లీ వస్తానని చెప్పి ఇంటికెళ్లి ఫ్రెష్ అయి వేణు వద్దకు వెళ్లాడు. అప్పటికే రాత్రి 12 గంటలు దాటింది. నేను పిలిస్తే ఎందుకు రాలేదంటూ చరణ్ పై వేణు రుసరుసలాడాడు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో పక్కకు వెళ్లి కత్తి తీసుకొచ్చిన వేణు చరణ్ పై విచక్షణా రహితంగా కత్తితో పొడిచి అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్ధరాత్రి పోలీసులు అక్కడకు చేరుకుని చరణ్ ను గూడూరులోని ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తరలించారు. శుక్రవారం ఉదయం చరణ్ మృతి చెందాడు. గూడూరు 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!